లోక్ సభ ఎన్నికలలోపే సీఏఏ అమలు: హోం మంత్రి అమిత్ షా

లోక్ సభ ఎన్నికలలోపే సీఏఏ అమలు: హోం మంత్రి అమిత్ షా
  •     త్వరలోనే రూల్స్ జారీ చేస్తం: అమిత్ షా
  •     ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కంటే ముందే సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్(సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దానికోసం అవసరమైన నిబంధనలను జారీ చేస్తామని చెప్పారు. ‘‘మన ముస్లిం సోదరులను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా వాళ్లను రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో హింసను ఎదుర్కొని ఇండియాకు వచ్చినోళ్లకు సిటిజన్ షిప్ ఇచ్చేందుకే సీఏఏ తీసుకొచ్చాం. ఏ ఒక్కరి ఇండియన్ సిటిజన్ షిన్ ను లాక్కోవడానికి కాదు” అని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నౌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమిట్–2024లో అమిత్ షా శనివారం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనిఫామ్ సివిల్ కోడ్(యూసీసీ)పైనా స్పందించారు. ‘‘యూసీసీ అనేది రాజ్యాంగ అజెండా. దీనిపై దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తదితరులు సంతకం చేశారు. కానీ బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ దాన్ని విస్మరించింది. ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలు ఒక సామాజిక మార్పు. దానిపై అన్నిచోట్ల చర్చ జరుగుతుంది” అని చెప్పారు. లౌకికవాద దేశంలో మతపరమైన చట్టాలు ఉండొద్దన్నారు. కాగా, 2019లో సీఏఏ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 

ఎన్డీయేలోకి ఆర్ఎల్డీ, ఎస్ఏడీ.. 

ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘లోక్ సభ ఎన్నికల రిజల్ట్​పై సస్పెన్స్ ఏమీ లేదు. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఇప్పటికే అర్థమైంది. మేం ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అందుకే ప్రజలు బీజేపీకి 370, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉంది” అని తెలిపారు. ఎన్డీయేలో ఆర్ఎల్డీ, శిరోమణి అకాలీదళ్ చేరికపై పరోక్షంగా హింట్ ఇచ్చారు.

కాంగ్రెస్ పై విమర్శలు.. 

1947లో జరిగిన దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమని అమిత్ షా విమర్శించారు. రాహుల్ గాంధీకి ‘భారత్ జోడో’ యాత్ర చేసే అర్హత లేదన్నారు. ‘‘మేం 2014లో అధికారంలోకి వచ్చే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అన్నిచోట్ల స్కామ్స్ జరిగాయి. విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. మేం అప్పుడే వైట్ పేపర్ రిలీజ్ చేసి ఉంటే, ప్రపంచానికి తప్పుడు మెసేజ్ వెళ్లేది. ఈ పదేండ్లలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాం.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించాం. అవినీతి అనేదే లేకుండా చేశాం. అందుకే ఇప్పుడు సరైన సమయమని వైట్ పేపర్ రిలీజ్ చేశాం” అని పేర్కొన్నారు. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని 500–550 ఏండ్ల పాటు దేశ ప్రజలు నమ్మారు. కానీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా టెంపుల్ నిర్మాణం ఆలస్యమైంది” అని కాంగ్రెస్​ను ఉద్దేశించి విమర్శలు చేశారు.